Wednesday, May 23, 2012

పారదర్శకత లేని వ్యవస్థలు

    
     వివిధ ఆరోపణలను ఎదుర్కొనే వారిని, వివిధ శాఖలు అదుపులోకి తీసుకోవడం ఒక సంచలనాత్మకమైన వార్తగా అన్ని న్యూస్ ఛానెల్స్, దిన పత్రికలు పతాక శీర్షికలతో రాస్తుంటారు. రెండు మూడు రోజులు హంగామాగా చేస్తుంటారు. ఫలానా తారా చౌదరి కేసులో ఫలానా టి.డి.పి. ఎం.ఎల్.ఎ.రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంది అని మీడియానే చెబుతుంది. తారా చౌదరి కొందరి ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు కథనాలు ప్రసారం చేస్తాయి. దమ్ముంటే నిరూపించ మనండి అని ఆరోపణలు ఎదుర్కునే వారు సవాలు విసురుతారు. ఈ హడావిడంతా రెండు మూడు రోజులే! ఆ తర్వాతా ఆ కేసు ఊసే ఉండదు. లొంగిపోయిన నిందితులు  ,నిందితురాలు నుంచి పోలీసులు ఏమి సమాచారాన్ని రాబట్టారో, ఏ ఏ ప్రశ్నలు సంధించారో పోలీసువారికి, సిబి ఐ వారికి తప్పించి మూడో కంటికి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు.  వాస్తవాల ఆధారంగా 'నిందితులు  శిక్షార్హులు' అనేదే విచారించే శాఖల ప్రధాన ఉద్దేశ్యమైతే విచారణను పారదర్శకంగా చెయ్యవచ్చుకదా? మీడియాను అనుమతించి విచారణను వీడియోగా చిత్రికరించవచ్చు. సమాజంలో ఒకమోస్తరు గుర్తింపు వున్న వ్యక్తి చస్తే స్మశానానికి వెళ్లి లైవ్ టెలికాస్ట్ చేసే చానెళ్ళు ఎటూ ఉన్నాయి. అవి విచారణ తంతును టెలికాస్ట్ చేస్తాయి.  లేదా విచారణాదికారులు   మీడియాకు విచారణ కు సంబంధించిన సి.డీ.లను ఇస్తే ప్రసారం చేసుకుంటాయి. ఇదంతా పార దర్శకంగా ఉండాలనే భావన ప్రభుత్వానికి,ఆయా శాఖలకు  ఉంటే సాధ్యం కానిది, చట్ట విరుధమైనది కాదు. ఇలా చేస్తే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ప్రయోజనం ఉండదుకదా? ఎన్నో కేసుల్లో పెద్దవాళ్ళ పేర్లు మొదట వినిపించాయి. ఆ తర్వాతా వాళ్ళ ఊసే ఉండదు. ఈ లోపే ప్రభుత్వ స్థాయిలో, పోలీసు బాసుల స్థాయిలో రావాల్సిన అవగాహనకు వారు వచ్చి ఒప్పందాలు కుదిరిపోతాయి. ఇప్పుడు తాజాగా జగన్ అక్రమ  ఆస్తుల  కేసుకు సంబంధించి జరిగే విచారణ కూడా గోప్యంగా ఉంది. కే.వి.పి.లాంటివారు ప్రభుత్వానికి అనుకూలురుగా ఉంటూ తననూ సి.బి.ఐ.విచారణ చేస్తారేమో అనే విచారమే లేకుండా హాయిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు (చేయిస్తున్నారు). వోక్స్ వెగన్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న బొత్స కూడా నీతిపరుడే! లిక్కర్ సిండికేట్ విచారణ నుంచి ఛాక చక్యంగా బొత్స సి.బి.ఐ.ని బుజ్జగించి తప్పించుకున్నాడు. ఇవేవీ అక్రమార్జన కేసులు కాదు అన్నట్లు సి.బి.ఐ.లక్ష్మీ నారాయణ వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వానికి ధిక్కార స్వరం వినిపించిన వారే ఇప్పుడు విచారణను ఎదుర్కుంటున్నారు. మంత్రులను విస్మరించి అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. మంత్రులలో కొందరినైనా విచారించక పోతే ప్రజలనుంచి విమర్శలు వస్తాయని సి.బి.ఐ. కొందరు మంత్రులను పెళ్ళికి పిలిచినట్లు పిలుస్తుంది. హోం శాఖా మంతిరి అలా  పిలిపించి విచారణ మమా అనిపించారు. వారు వీడియా ముందుకు వచ్చి సి.బి.ఐ.వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చాను అని కూల్ గా సమాధానం చెప్పి వెళుతున్నారు, అవినీతికి తాము ఆమడ దూరం అన్నట్లు!
     కనుక విచారణ భాగోతాలను వివిధ దశలలో కాకున్నా విచారణ మొత్తాన్ని కోర్టు స్థాయికి వెళ్ళే సందర్భంలోనైన ప్రజాస్వామ్య వ్యవస్థలో గొప్పదైన ప్రజా కోర్టుకు తెలియ జేసే ప్రయత్నం సి.బి.ఐ.చెయ్యాలి. లేదా ప్రముఖ పౌర సమాజం సభ్యుల సమక్షంలో విచారణ జరిగినప్పుడే సి.బి.ఐ.ని, పోలీసు వ్యవస్థను ప్రజలు విశ్వసిస్తారు.
  

No comments:

Post a Comment